పతనం
మధుర గాయాల వేణువునై
కోటిరాగాల జననినై
జీవిస్తున్నానని వెదురు....
వేయితలలను సైతం వినయంగా వంచి
వేలాదిజీవుల ఆకలితీరుస్తున్నానని వరిపైరు
తృప్తిగా తనువుచాలిస్తున్నాయి.
కానీ నేను...
గమ్యం వుండీ గమనం లేక
విజ్ఞానంవుండీ జ్ఞానంలేక
మనిషినైవుండీ మానవత్వంలేక
పతనమైపోతున్నాను
నిను చేరకముందే
భావం భాషగ మారకముందే
మనసు మూగబోయింది
మోడు చిగురులు వేయక ముందే
వసంతం వెళ్ళిపోయింది
కల కన్ను తెరవక ముందే
కరిగి కన్నీరైపోయింది
నా దారి నిను చేరకముందే
గమ్యం మారిపోయింది
నా పయనం ఆగిపోయింది
మరచిపోకు నేస్తమా...
నీ పరిచయం పంచిన ఆనందం
అనుభూతులుగా మార్ఛి
గుండెల్లో దొంతర్లుగా పేర్చి
నాతోపాటు తీసుకెళుతున్నాను
ఈ దూరం మన స్నేహాన్ని దూరం చెయ్యదు కదా?
ఈ కాలం మన అనుభూతులని మరుగుపరచదు కదా?
తిరిగొఛ్ఛిన నన్ను నీ స్నేహం నువ్వెవరని గేలి చేయదు కదా
కలలు కన్న తీరాన్ని చేరుతూ
ఇక్కడి అనుబంధాన్ని మరువనని
మాటిస్తున్నాను నేస్తం... మరి...నువ్వు???
లాస్యం
అధర కాగితాలపై విరిసే
సుమధుర కవిత
మనసుల్ని దోచే
హిమ వీచిక
మృదు మధుర దరహాసిక
ఓ సుందర జ్ఞాపిక
కలతల్ని మరిపించి మురిపించే
అనిర్వచనీయ కానుక
మాట రాని మనసులకు పలుకు నేర్పే
లిపిలేని భావమిదే ఇక.
నీకోసం
శూన్యంలో సైతం వెతుకుతున్నా
ఊహకందని నీ రూపుకోసం
నిను వర్ణించడానికి అందమైన భాషకోసం
గాలినై పయనిస్తున్నా
అంతుచిక్కని నీజాడ కోసం
వెచ్చనైన నీ స్పర్శ కోసం ప్రియా ...
ఎప్పుడు కనిపిస్తావు?
నీ అనురాగంలో ఎప్పుడు ముంచేస్తావు?
నీపై
సఖుడా
నీ రూపు నా కనులలో మెదులుతుండగా
భావావేశాలకు అతీతంగా
నీ మీద కలిగే ఆ భావనే
నీవు నాకెంతో ప్రత్యేకం అని తెలియచేస్తూవుంటుంది
నీ స్నేహాన్ని పొందమని
మనసు తొందర పెడుతూవుంటుంది
మరపు
ప్రతి నవ్వులో నీ మాట వింటూ
ప్రతి మోములో నీ రూపు కంటూ
ప్రతి అనుభూతిలో నీ ఆనవాళ్ళంటూ
చదివే ప్రతి పుటలో నువ్వున్నావంటూ ఇలా బ్రతికేస్తున్నానంతే...
ఎంత బాగుందీ ఊహ ..
నిజానికి ఎదీ నువ్వెక్కడున్నావు?
నువ్వొక జ్ఞాపకమంతే
గుర్తు చేసుకుంటే గుర్తొస్తావు
అదొక అనుభూతి అంతే
వద్దనుకుంటే మర్ఛిపోగలను.........
మర్ఛిపోయాను
నువ్వు లేకపోయినా
అనుకోకుండా కలిసి
అడగకుండా యదలో చేరి
ఆశలు రేపి ఆశయం చూపి
మనిషిని చేసి
మనసుని దోచి
మదిలో నిలిచిన ఆమె నన్నొదిలి వెళితే..
నేను జీవించగలనా?
జీవించినా ఆమె జ్ఞాపకాలతో మామూలుగా మనగలనా?
అనుకొన్నా!
ఇది మూడేళ్ళ క్రితం మాట
కాని ఇంతలోనే బ్రతికేస్తున్నా
ఆమె జ్ఞాపకాలు మచ్చుకి సైతం లేకుండా
No comments:
Post a Comment
all are very happy to everone